జీవితం గురించి మరియు దేవుని గురించి అన్వేషించదగిన ప్రశ్నలు అడిగే చోటు
జీవితం గురించి మరియు దేవుని గురించి అన్వేషించదగిన ప్రశ్నలు అడిగే చోటు
పంచుకోండిి  

యేసు ఎవరు?

ఈ క్రింది వచనములు యేసు క్రీస్తు యొక్క జీవితమును గూర్చి మీకు ఒక అవగాహనను ఇస్తుంది. ఇవి బైబిల్ లోని యోహాను సువార్త నుండి సేకరించబడినవి. ఎలాంటి వ్యాఖ్యలు జోడించబడలేదు. యేసు జీవితం, మరణం, మరియు పునరుత్ధానమును గూర్చి...మరియు మీకు ఆయన జీవితం ఎందుకు ప్రాముఖ్యమైనదో ఇవి మీకు ఖచ్చితమైన వేగిరమైన అధ్యయనమును ఇస్తాయి.

యోహాను 3

యూదుల అధికారియైన నీకొదేమను పరిసయ్యు డొకడుండెను. అతడు రాత్రియందు ఆయనయొద్దకు వచ్చిబోధకుడా, నీవు దేవునియొద్దనుండి వచ్చిన బోధ కుడవని మే మెరుగుదుము; దేవుడతనికి తోడైయుంటేనే గాని నీవు చేయుచున్న సూచకక్రియలను యెవడు చేయలేడని ఆయనతో చెప్పెను.

అందుకు యేసు అతనితో-ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

అందుకు నీకొదేము ముసలివాడైన మనుష్యుడేలాగు జన్మింపగలడు? రెండవమారు తల్లి గర్బమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా

యేసు ఇట్లనెను ఒకడు నీటిమూలముగాను ఆత్మమూలముగాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునైయున్నది. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తన కిష్టమైన చోటను విసరును; నీవు దాని శబ్దము విందువేగాని అది యెక్కడనుండి వచ్చునో యెక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడును ఆలాగే యున్నాడనెను.

అందుకు నీకొదేము ఈ సంగతులేలాగు సాధ్యములని ఆయనను అడుగగా యేసు ఇట్లనెను నీవు ఇశ్రాయేలుకు బోధకుడవై యుండి వీటిని ఎరుగవా? భూసంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు, పరలోకసంబంధ మైనవి మీతో చెప్పినయెడల ఏలాగు నమ్ముదురు? మరియు పరలోకమునుండి దిగివచ్చినవాడే, అనగా పరలోకములో ఉండు మనుష్యకుమారుడే తప్ప పరలోకము నకు ఎక్కిపోయిన వాడెవడును లేడు.

దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంప లేదు. ఆయనయందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు; విశ్వసింపనివాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాస ముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను.

యోహాను 1

ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆయన ఆది యందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు. ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను.

ఆయన లోకములో ఉండెను, లోకమాయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలిసికొనలేదు. ఆయన తన స్వకీ యులయొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరంగీకరించిరో వారికంద రికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవునివలన పుట్టినవారే గాని, రక్తమువలననైనను శరీరేచ్ఛవలననైనను మానుషేచ్ఛవలననైనను పుట్టినవారు కారు.

ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వి తీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి.

యోహాను 5

ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు ఊచకాలుచేతులు గలవారు, గుంపులుగా పడియుండిరి. అక్కడ ముప్పది యెనిమిది ఏండ్లనుండి వ్యాధిగల యొక మనుష్యుడుండెను. యేసు, వాడు పడియుండుట చూచి, వాడప్పటికి బహుకాలమునుండి ఆ స్థితిలోనున్నాడని యెరిగి

యేసు నీవు లేచి నీ పరుపెత్తికొని నడువుమని వానితో చెప్పగా

వెంటనే వాడు స్వస్థతనొంది తన పరుపెత్తికొని నడిచెను.ఆ దినము విశ్రాంతిదినము గనుక యూదులు ఇది విశ్రాంతిదినము గదా; నీవు నీ పరుపెత్తికొన తగదే అని స్వస్థత నొందినవానితో చెప్పిరి.

అందుకు వాడు నన్ను స్వస్థపరచినవాడునీ పరుపెత్తికొని నడువుమని నాతో చెప్పెననెను.

వారు నీ పరుపెత్తికొని నడువుమని నీతో చెప్పినవాడెవడని వానిని అడిగిరి. తన్ను స్వస్థపరచినవాడు యేసు అని యూదులకు తెలియజెప్పెను.

ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు;

ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమేగాక, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి, తన్ను దేవునితో సమానునిగా చేసికొనెను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి.

యోహాను 6

కాబట్టి యేసు కన్నులెత్తి బహు జనులు తన యొద్దకు వచ్చుట చూచివీరు భుజించుటకు ఎక్కడనుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పు నడిగెను గాని యేమి చేయనై యుండెనో తానే యెరిగియుండి అతనిని పరీక్షించుటకు ఆలాగడిగెను.

అందుకు ఫిలిప్పువారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను రెండువందల దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను. ఆయన శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ ఇక్కడ ఉన్న యొక చిన్న వానియొద్ద అయిదు యవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి గాని, యింత మందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా

యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాల పచ్చికయుండెను గనుక లెక్కకు ఇంచుమించు అయిదువేలమంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్నవారికి వడ్డించెను. ఆలాగున చేపలుకూడ వారికిష్టమైనంత మట్టుకు వడ్డించెను;

వారు తృప్తిగా తినిన తరువాత ఏమియు నష్టపడకుండ మిగిలిన ముక్కలు పోగుచేయుడని తన శిష్యులతో చెప్పెను. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన అయిదు యవల రొట్టెల ముక్కలు పోగుచేసి పండ్రెండు గంపలు నింపిరి.

యేసు మీరు సూచనలను చూచుటవలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుటవలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారముకొరకు కష్టపడకుడి గాని నిత్యజీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి; మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును, ఇందుకై తండ్రియైన దేవుడు ఆయనకు ముద్రవేసియున్నాడని చెప్పెను.

వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయ వలెనని ఆయనను అడుగగా

యేసు ఆయన పంపిన వానియందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియయని వారితో చెప్పెను. జీవాహారము నేనే; నాయొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నాయందు విశ్వాసముంచు వాడు ఎప్పుడును దప్పిగొనడు. మీరు నన్ను చూచి యుండియు విశ్వసింపక యున్నారని మీతో చెప్పితిని. తండ్రి నాకు అనుగ్రహించువారందరును నాయొద్దకు వత్తురు; నాయొద్దకు వచ్చువానిని నేనెంతమాత్రమును బయటికి త్రోసివేయను. కుమారుని చూచి ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్తము; అంత్యదినమున నేను వానిని లేపుదును.

యోహాను 7

ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచిఎవడైనను దప్పిగొనిన యెడల నాయొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులోనుండి జీవ జలనదులు పారునని బిగ్గరగా చెప్పెను. తనయందు విశ్వాసముంచువారు పొంద బోవు ఆత్మనుగూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడియుండలేదు.

జనసమూహములో కొందరు ఈ మాటలు వినినిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనిరి; మరికొందరు ఈయన క్రీస్తే అనిరి;

యోహాను 10

గొఱ్ఱల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొకమార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడు నైయున్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొఱ్ఱల కాపరి.

ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను గాని ఆయన తమతో చెప్పిన సంగతులెట్టివో వారు గ్రహించుకొనలేదు కాబట్టి యేసు మరల వారితో ఇట్లనెను:

నేను గొఱ్ఱలకు మంచి కాపరిని; మంచి కాపరి గొఱ్ఱలకొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొఱ్ఱల కాపరికాడు గనుక గొఱ్ఱలు తనవికానందున తోడేలు వచ్చుట చూచి గొఱ్ఱలను విడిచిపెట్టి పారిపోవును, తోడేలు ఆ గొఱ్ఱలను పట్టి చెదరగొట్టును. జీతగాడు జీతగాడే గనుక గొఱ్ఱలనుగూర్చి లక్ష్యము చేయక పారిపోవును.

నేను గొఱ్ఱల మంచి కాపరిని. తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో ఆలాగే నేను నా గొఱ్ఱలను ఎరుగుదును, నా గొఱ్ఱలు నన్ను ఎరుగును. మరియు గొఱ్ఱలకొరకు నా ప్రాణము పెట్టుచున్నాను.

నేను దాని మరల తీసికొనునట్లు నా ప్రాణము పెట్టుచున్నాను; ఇందు వలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణము తీసికొనడు; నా అంతట నేనే దాని పెట్టుచున్నాను; దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసికొనుటకును నాకు అధికారము కలదు; నా తండ్రివలన ఈ ఆజ్ఞ పొందితిననెను.

చేసినయెడల నన్ను నమ్మకున్నను, తండ్రి నాయందును నేను తండ్రియందును ఉన్నామని మీరు గ్రహించి తెలిసి కొనునట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పెను.

యోహాను 11

లాజరు అను ఒకడు రోగి యాయెను. ఈ లాజరు ప్రభువునకు అత్తరుపూసి తల వెండ్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లెండ్రుప్రభువా, యిదిగో నీవు ప్రేమించువాడు రోగియై యున్నాడని ఆయనయొద్దకు వర్తమానము పంపిరి. యేసు అది వినియీ వ్యాధి మరణముకొరకు వచ్చినదికాదు గాని దేవుని కుమారుడు దానివలన మహిమ పరచబడునట్లు దేవుని మహిమకొరకు వచ్చినదనెను. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. అతడు రోగియై యున్నాడని యేసు వినినప్పుడు తానున్నచోటనే యింక రెండు దినములు నిలిచెను.

అటుపిమ్మట ఆయన మనము యూదయకు తిరిగి వెళ్లుదమని తన శిష్యులతో చెప్పగా ఆయన శిష్యులుబోధకుడా, యిప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే; అక్కడికి తిరిగి వెళ్లుదువా అని ఆయన నడిగిరి.

ఆయన యీ మాటలు చెప్పిన తరువాతమన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు; అతని మేలు కొలుప వెళ్లుచున్నానని వారితో చెప్పగా శిష్యులు ప్రభువా, అతడు నిద్రించినయెడల బాగుపడుననిరి. యేసు అతని మరణమునుగూర్చి ఆ మాట చెప్పెను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పెననుకొనిరి. కావున యేసు లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను; అయినను అతనియొద్దకు మనము వెళ్లుదము రండని స్పష్టముగా వారితో చెప్పెను.

యేసు వచ్చి అదివరకే అతడు నాలుగు దినములు సమాధిలో ఉండెనని తెలిసికొనెను. మార్త యేసుతోప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకను గ్రహించునని యెరుగుదుననెను.

యేసు నీ సహోదరుడు మరల లేచునని ఆమెతో చెప్పగా

మార్త ఆయనతో అంత్యదినమున పునరుత్థానమందు లేచునని యెరుగుదుననెను.

అందుకు యేసుపు నరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చని పోయినను బ్రదుకును; బ్రదికి నాయందు విశ్వాస ముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? అని ఆమెను నడిగెను.

ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను.

అంతట మరియ యేసు ఉన్న చోటికి వచ్చి, ఆయనను చూచి, ఆయన పాదములమీద పడిప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండు ననెను.

ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడ వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతని నెక్కడ నుంచితిరని అడుగగా, వారు ప్రభువా, వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి.

యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతనిని ఏలాగు ప్రేమించెనో చూడుడని చెప్పుకొనిరి. వారిలో కొందరు ఆ గ్రుడ్డి వాని కన్నులు తెరచిన యీయన, యితనిని చావకుండ చేయలేడా అని చెప్పిరి.

యేసు మరల తనలో మూలుగుచు సమాధియొద్దకు వచ్చెను. అది యొక గుహ, దానిమీద ఒక రాయి పెట్టియుండెను. యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయినవాని సహోదరియైన మార్త

ప్రభువా, అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఇప్పటికి వాసనకొట్టునని ఆయనతో చెప్పెను.

అందుకు యేసు నీవు నమి్మనయెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను;

అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి తండ్రీ, నీవు నా మనవి వినినందున నీకు కృత జ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడును నా మనవి వినుచున్నావని నేనెరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టు నిలిచియున్న యీ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై యీ మాట చెప్పితిననెను.

ఆయన ఆలాగు చెప్పి లాజరూ, బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు, కాళ్లు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడై వెలుపలికి వచ్చెను; అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతట యేసు మీరు అతని కట్లు విప్పిపోనియ్యుడని వారితో చెప్పెను. కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్య మును చూచిన యూదులలో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి కాని

వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్లి యేసుచేసిన కార్యములను గూర్చి వారితో చెప్పిరి. కాబట్టి ప్రధానయాజకులును పరిసయ్యులును మహా సభను సమకూర్చిమనమేమి చేయుచున్నాము? ఈ మనుష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే. మనమాయనను ఈలాగు చూచుచు ఊరకుండినయెడల అందరు ఆయనయందు విశ్వాస ముంచెదరు; కాగా ఆ దినమునుండి వారు ఆయనను చంప నాలో చించుచుండిరి.

యోహాను 12

అయినను అధికారులలో కూడ అనే కులు ఆయనయందు విశ్వాసముంచిరిగాని, సమాజములో నుండి వెలివేయబడుదుమేమో యని పరిసయ్యులకు భయ పడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పుకంటె మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి.

యోహాను 13

తాను ఈ లోకమునుండి తండ్రియొద్దకు వెళ్లవలసిన గడియ వచ్చెనని యేసు పస్కాపండుగకు ముందే యెరిగిన వాడై, లోకములోనున్న తనవారిని ప్రేమించి, వారిని అంతమువరకు ప్రేమించెను. వారు భోజనము చేయు చుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించియుండెను.

యేసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవర పడిమీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పెను.

యోహాను 14

మీ హృదయమును కలవరపడనియ్యకుడి; దేవుని యందు విశ్వాసముంచుచున్నారు నాయందును విశ్వాస ముంచుడి. నా తండ్రి యింట అనేక నివాసములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును; మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను. నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును.

మిమ్మును అనాథ లనుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడును చూడదు; అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. నేను నా తండ్రియందును, మీరు నాయందును, నేను మీయందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు; నన్ను ప్రేమించువాడు నా తండ్రివలన ప్రేమింపబడును; నేనును వానిని ప్రేమించి, వానికి నన్ను కనబరచుకొందునని చెప్పెను.

యోహాను 15

తండ్రి నన్ను ఏలాగు ప్రేమించెనో నేనును మిమ్మును ఆలాగు ప్రేమించితిని, నా ప్రేమయందు నిలిచి యుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనినయెడల నా ప్రేమయందు నిలిచియుందురు. మీయందు నా సంతోషము ఉండవలెననియు, మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు, ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను.

నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము, మీ రొకనినొకడు ప్రేమించ వలెననుటయే నా ఆజ్ఞ తన స్నేహితులకొరకు తన ప్రాణము పెట్టువానికంటె ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు.

లోకము మిమ్మును ద్వేషించినయెడల మీకంటె ముందుగా నన్ను ద్వేషించెనని మీరెరుగుదురు. మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును; అయితే మీరు లోకసంబంధులు కారు; నేను మిమ్మును లోకములోనుండి ఏర్పరచుకొంటిని; అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. అయితే వారు నన్ను పంపిన వానిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటినన్నిటిని మీకు చేయుదురు. నేను వచ్చి వారికి బోధింపకుండినయెడల, వారికి పాపము లేకపోవును; ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు. నన్ను ద్వేషించువాడు నా తండ్రినికూడ ద్వేషించుచున్నాడు. ఎవడును చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండినయెడల వారికి పాపము లేకపోవును; ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించియున్నారు. అయితే నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రములో వ్రాయబడిన వాక్యము నెర వేరునట్లు ఈలాగు జరిగెను.

యోహాను 16

మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును; మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్త్రీ ప్రసవించునప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదనపడును; అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనను సంతోషముచేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసికొనదు. అటువలె మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మును మరల చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతొషమును ఎవడును మీయొద్దనుండి తీసివేయడు. ఆ దినమున మీరు దేని గూర్చియు నన్ను అడుగరు; మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదివరకు మీరేమియు నా పేరట అడుగలేదు; మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరకును. ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పితిని; అయితే నేనిక యెన్నడును గూఢార్థముగా మీతో మాటలాడక తండ్రినిగూర్చి మీకు స్పష్టముగా తెలియజెప్పు గడియ వచ్చుచున్నది. ఆ దినమందు మీరు నా పేరట అడుగుదురు గాని మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పుటలేదు. మీరు నన్ను ప్రేమించి, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చియున్నాను; మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్లుచున్నానని వారితో చెప్పెను.

యోహాను 17

యేసు ఈ మాటలు చెప్పి ఆకాశమువైపు కన్నులెత్తి యిట్లనెను

తండ్రీ, నా గడియ వచ్చియున్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమ పరచుము. నీవు నీ కుమారునికిచ్చిన వారికందరికిని ఆయన నిత్యజీవము అనుగ్రహించునట్లు సర్వశరీరులమీదను ఆయనకు అధికారమిచ్చితివి. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము.

చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమిమీద నిన్ను మహిమ పరచితిని. తండ్రీ, లోకము పుట్టకమునుపు నీయొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీయొద్ద మహిమ పరచుము.

లోకము నుండి నీవు నాకు అను గ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని. వారు నీవారై యుండిరి, నీవు వారిని నాకను గ్రహించితివి; వారు నీ వాక్యము గైకొని యున్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికిచ్చి యున్నాను; వారామాటలను అంగీకరించి, నేను నీయొద్దనుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి, నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించిన వన్నియు నీవలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి యున్నారు. నేను వారికొరకు ప్రార్థన చేయుచున్నాను; లోకముకొరకు ప్రార్థన చేయుటలేదు, నీవు నాకు అనుగ్ర హించి యున్నవారు నీవారైనందున వారికొరకే ప్రార్థన చేయుచున్నాను.

నీతి స్వరూపుడవగు తండ్రీ, లోకము నిన్ను ఎరుగలేదు; నేను నిన్ను ఎరుగుదును; నీవు నన్ను పంపితివని వీరెరిగి యున్నారు. నీవు నాయందు ఉంచిన ప్రేమ వారియందు ఉండునట్లును, నేను వారియందు ఉండునట్లును, వారికి నీ నామమును తెలియజేసితిని, ఇంకను తెలియ జేసెదనని చెప్పెను.

యోహాను 18

యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతోకూడకెద్రోను వాగు దాటి పోయెను. అక్కడ ఒక తోట యుండెను, దానిలోనికి ఆయన తన శిష్యులతోకూడ వెళ్లెను. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్లు చుండువాడు గనుక, ఆయనను అప్పగించు యూదాకును ఆ స్థలము తెలిసియుండెను. కావున యూదా సైనికులను, ప్రధానయాజకులు పరిసయ్యులు పంపిన బంట్రౌతులను వెంటబెట్టుకొని, దివిటీలతోను దీపములతోను ఆయుధముల తోను అక్కడికివచ్చెను.

యేసు తనకు సంభవింపబోవున వన్నియు ఎరిగినవాడై వారియొద్దకు వెళ్లిమీరెవని వెదకుచున్నారని వారిని అడిగెను.

వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియ్యగా

యేసు ఆయనను నేనే అని వారితో చెప్పెను; ఆయనను అప్పగించిన యూదాయు వారియొద్ద నిలుచుండెను.

అంతట సైనికులును సహస్రాధిపతియు, యూదుల బంట్రౌతులును యేసును పట్టుకొని ఆయనను బంధించి, మొదట అన్నయొద్దకు ఆయనను తీసికొనిపోయిరి.

కావున పిలాతు బయట ఉన్నవారియొద్దకు వచ్చిఈ మనుష్యునిమీద మీరు ఏ నేరము మోపుచున్నారనెను.

అందుకు వారు వీడు దుర్మార్గుడు కానియెడల వీనిని నీకు అప్పగించియుండ మని అతనితో చెప్పిరి.

పిలాతు మీరతని తీసికొనిపోయి మీ ధర్మశాస్త్రము చొప్పున అతనికి తీర్పుతీర్చుడనగా

యూదులు ఎవనికిని మరణశిక్ష విధించుటకు మాకు అధికారములేదని అతనితో చెప్పిరి. అందువలన యేసు తాను ఎట్టి మరణము పొందబోవునో దానిని సూచించి చెప్పిన మాట నెరవేరెను.

యోహాను 19

అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తలమీద పెట్టి ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయనయొద్దకు వచ్చియూదుల రాజా, శుభమని చెప్పి ఆయనను అర చేతులతో కొట్టిరి.

పిలాతు మరల వెలుపలికి వచ్చిఇదిగో ఈయనయందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియునట్లు ఈయనను మీయొద్దకు వెలుపలికి తీసికొని వచ్చుచున్నానని వారితో అనెను.

ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించినవాడై, యేసు వెలుపలికి రాగా, పిలాతు ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పెను. ప్రధాన యాజకులును బంట్రౌతులును ఆయనను చూచి సిలువవేయుము సిలువవేయుము అని కేకలువేయగా పిలాతు

ఆయనయందు ఏ దోషమును నాకు కనబడలేదు గనుక మీరే ఆయనను తీసికొనిపోయి సిలువవేయుడని వారితో చెప్పెను.

అందుకు యూదులుమాకొక నియ మము కలదు; తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలెనని అతనితో చెప్పిరి.

పిలాతు ఆ మాట విని మరి యెక్కువగా భయపడి, తిరిగి అధికారమందిరములో ప్రవేశించి నీవెక్కడ నుండి వచ్చితివని యేసును అడిగెను;

అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు

గనుక పిలాతునాతో మాటలాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు, నిన్ను సిలువవేయుటకు నాకు అధికారము కలదనియు నీ వెరుగవా? అని ఆయనతో అనెను.

అందుకు యేసుపైనుండి నీకు ఇయ్యబడి యుంటేనే తప్ప నామీద నీకు ఏ అధికారమును ఉండదు; అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనెను.

ఈ మాటనుబట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నముచేసెను గాని యూదులునీవు ఇతని విడుదల చేసితివా కైసరునకు స్నేహితుడవు కావు; తాను రాజునని చెప్పుకొను ప్రతివాడును కైసరునకు విరోధముగా మాటలాడుచున్నవాడే అని కేకలువేసిరి.

అందుకు వారు ఇతనిని సంహ రించుము, సంహరించుము, సిలువవేయుము అని కేకలు వేసిరి. పిలాతుమీ రాజును సిలువవేయుదునా?

అప్పుడు సిలువవేయబడుటకై అతడాయనను వారికి అప్పగించెను.

వారు యేసును తీసికొనిపోయిరి. ఆయన తన సిలువ మోసికొని కపాలస్థలమను చోటికి వెళ్లెను. హెబ్రీ బాషలో దానికి గొల్గొతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకనిని ఆ వైపున ఒకనిని మధ్యను యేసును ఉంచి ఆయనతోకూడ ఇద్దరిని సిలువవేసిరి.

అటుతరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లునేను దప్పిగొనుచున్నాననెను. చిరకతో నిండియున్న యొక పాత్ర అక్కడ పెట్టియుండెను గనుక వారు ఒక స్పంజీ చిరకతో నింపి, హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందిచ్చిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను.

ఆ దినము సిద్ధపరచుదినము; మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున సిలువ మీద ఉండకుండునట్లు, వారి కాళ్లు విరుగగొట్టించి వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగిరి.

కాబట్టి సైనికులు వచ్చి ఆయనతోకూడ సిలువవేయబడిన మొదటి వాని కాళ్లను రెండవవాని కాళ్లను విరుగగొట్టిరి. వారు యేసునొద్దకు వచ్చి, అంతకుముందే ఆయన మృతిపొంది యుండుట చూచి ఆయన కాళ్లు విరుగగొట్టలేదు గాని సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను.

అటుతరువాత, యూదుల భయమువలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయియ యోసేపు, తాను యేసు దేహమును తీసికొనిపోవుటకు పిలాతు నొద్ద సెలవడిగెను. పిలాతు సెలవిచ్చెను. గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొనిపోయెను. మొదట రాత్రివేళ ఆయన యొద్దకు వచ్చిన నీకొదేముకూడ బోళముతో కలిపిన అగరు రమారమి నూట ఏబది సేర్ల యెత్తు తెచ్చెను. అంతట వారు యేసు దేహ మును ఎత్తికొని వచ్చి, యూదులు పాతి పెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధద్రవ్యములు దానికి పూసి నార బట్టలు చుట్టిరి. ఆయనను సిలువవేసిన స్థలములో ఒక తోట యుండెను; ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని క్రొత్తసమాధియొకటి యుండెను. ఆ సమాధి సమీపములో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి.

యోహాను 20

ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధియొద్దకు వచ్చి, సమాధి మీద ఉండిన రాయి తీయబడియుండుట చూచెను. గనుక ఆమె పరుగెత్తికొని సీమోను పేతురునొద్దకును యేసు ప్రేమించిన ఆ మరియొక శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలోనుండి యెత్తికొనిపోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో యెరుగమని చెప్పెను.

కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధియొద్దకు వచ్చిరి. వారిద్దరును కూడి పరుగెత్తుచుండగా, ఆ శిష్యుడు పేతురుకంటే త్వరగా పరుగెత్తి ముందుగా సమాధియొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడియుండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు.

అంతట సీమోను పేతురు అతని వెంబడి వచ్చి, సమాధిలో ప్రవేశించి, నారబట్టలు పడియుండుటయు, ఆయన తల రుమాలు నార బట్టలయొద్ద ఉండక వేరుగా ఒకటచోట చుట్టిపెట్టియుండు టయు చూచెను. అప్పుడు మొదట సమాధియొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతులలోనుండి లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపరైరి. అంతట ఆ శిష్యులు తిరిగి తమ వారియొద్దకు వెళ్లిపోయిరి.

అయితే మరియ సమాధి బయట నిలిచి యేడ్చు చుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా, తెల్లని వస్త్రములు ధరించిన యిద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్లవైపున ఒకడును కూర్చుండుట కనబడెను.

వారు అమ్మా, యెందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా

ఆమె నా ప్రభువును ఎవరో యెత్తికొని పోయిరి; ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పెను.

ఆమె యీ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి, యేసు నిలిచియుండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు.

యేసు అమ్మా, యందుకు ఏడ్చుచున్నావు, ఎవనిని వెదకు చున్నావు? అని ఆమెను అడుగగా

ఆమె ఆయన తోటమాలి అనుకొని అయ్యా, నీవు ఆయనను మోసికొని పొయినయెడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తికొని పోదునని చెప్పెను.

యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను.

ఆమె ఆయనవైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూనీ అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము.

యేసు ఆమెతో నేను ఇంకను తండ్రియొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు; అయితే నా సహోదరులయొద్దకు వెళ్లినా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవు చున్నానని వారితో చెప్పుమనెను.

మగ్దలేనే మరియ వచ్చినేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని శిష్యులకు తెలియజేసెను.

ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి, తాము కూడియున్న యింటి తలుపులు మూసి కొనియుండగా యేసు వచ్చి మధ్యను నిలిచిమీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను.

ఆయన ఆలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసుమరల మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. ఆయన ఈ మాట చెప్పి వారిమీద ఊది పరిశుద్ధాత్మమ పొందుడి.

యేసు వచ్చినప్పుడు, పండ్రెండుమందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా

అతడు నేనాయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి, నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మనని వారితో చెప్పెను.

ఎనిమిది దినములైన తరువాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడ ఉండెను. తలుపులు మూయబడియుండగా యేసు వచ్చి మధ్యను నిలిచిమీకు సమాధానము కలుగును గాక అనెను.

తరువాత తోమాను చూచినీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము; నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుమనెను.

అందుకు తోమా ఆయనతోనా ప్రభువా, నా దేవా అనెను.

యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మినవారు ధన్యులని అతనితో చెప్పెను.


యేసు మీకు ఏమి ఇచ్చుచున్నాడో చూడండి. దయచేసి చూడండి "గుడ్డి విశ్వాసమునకు ఆవల."

 దేవునితో సంబంధం ఎలా ప్రారంబించాలి ?
 నాకు ఒక ప్రశ్నఉన్నది,,,

Unless otherwise indicated, all Scripture quotations are taken from the Holy Bible, New Living Translation, copyright © 1996, 2004, 2007 by Tyndale House Foundation. Used by permission of Tyndale House Publishers, Inc., Carol Stream, Illinois 60188. All rights reserved.

ఇతరులతో పంచుకోండ  

TOP