జీవితం గురించి మరియు దేవుని గురించి అన్వేషించదగిన ప్రశ్నలు అడిగే చోటు
జీవితం గురించి మరియు దేవుని గురించి అన్వేషించదగిన ప్రశ్నలు అడిగే చోటు
పంచుకోండిి  

జీవితం – ఎందుకింత కష్టం?

ఎందుకు? జీవితం కష్టంగా ఉన్నప్పుడు శాంతి దొరికే మార్గం ఉందా?

లోకంలో మనం చూస్తున్న వాటిని ఎలా వివరించగలం? తీవ్రవాదుల దాడులు, లైంగిక బానిసత్వం, జాతి వైషమ్యాలు, ఆకలి కేకలు మొదలైనవాటికి జవాబేది?

బహశా మనసు అట్టడుగు పొరల్లో అప్పుడప్పుడు మనకు మనమే ఈ ప్రశ్నలు వేసుకుంటామేమో గాని దానిమీద అంతగా శ్రద్ద పెట్టము. ఒక్క క్షణం ఆగి ‘ఎందుకిలా’? అని ఆగి ఆలోచించే తీరిక కూడా లేనట్టుగా బ్రతికేస్తున్నాం.

అయితే ఉన్నట్టుండి ఏదో సంఘటన మనల్ని కుదిపేస్తుంది. అమ్మా నాన్నలు విడిపోతారు. మన వీధి చివర్లో ఉండే అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. బంధువుల్లో ఒకరికి కాన్సర్ వస్తుంది. అది ఒక్కసారిగా మనల్ని మేల్కొలుపుతుంది. అయితే కొద్ది రోజుల్లోనే మళ్ళీ మామూలైపోతాం-మళ్ళీ ఎప్పుడో మరో విషాదం మనల్ని కుదిపేసే వరకు. ఏమిటిదంతా? ఏదో తేడా ఉందే ? జీవితమంటే ఇలా ఉండకూడదు కదా? అని అప్పుడు ఆలోచించడం ప్రారంభిస్తాం.

ఎందుకు చెడ్డ సంగతులు జరుగుతున్నాయి? ఈలోకం మెరుగైన ప్రదేశంగా ఎందుకు లేదు?

‘ఎందుకిలా’ అనే ఈ ప్రశ్నకు జవాబు మనకు బైబిల్లో దొరుకుతుంది. అయితే ఆ జవాబు వినడం చాలామందికి ఇష్టం ఉండదు. ఈ లోకం ఇలా ఎందుకున్నదంటే , ఓ రకంగా అది మనం కోరి తెచ్చుకున్నదే.

వినడానికి విచిత్రంగా ఉంది కదూ?

ఏది లేక ఎవరు ఈ లోకాన్ని ఇప్పుడున్నడానికి భిన్నంగా చేయగలరు? ఈ జీవితాన్ని అందరికీ అన్ని వేళలా బాధారహితంగా చేయగల భరోసా ఏది లేక ఎవరు ఇవ్వగలరు?

దేవుడు చేయగలడు. దేవుడే దాన్ని చేయగలడు. అయితే ఆయన చేయడు. ప్రస్తుతానికైతే ఆయన చేయట్లేదు. ఫలితంగా మనం ఆయన మీద కోపంగా ఉన్నాం. “దేవుడు నిజంగా సర్వశక్తిమంతుడు, ప్రేమమయుడు అయ్యుండడు. ఆయన నిజంగా ప్రేమమయుడు, సర్వశక్తిమంతుడు అయ్యుంటే, ఈ లోకం ఇలా ఎందుకుంటుంది?” అని అంటుంటాం.

ఇలా అంటేనన్నా దేవుడు తన పద్దతి మార్చుకుంటాడనే ఆశతో అలా అంటుంటాం. ఆయన మీద దోషారోపణ చేస్తే ఆయన పనిచేసే పద్దతి మార్చుకుంటాడనే ఆశతో అలా మాట్లాడుతుంటాం.

అయితే ఆయన మాత్రం ఏమీ దిగొచ్చినట్టుగా కనబడడు. ఎందుకనో?

దేవుడేమీ పట్టించుకున్నట్లుగా కనబడడు. ఇప్పటికిప్పుడు పరిస్థితులను ఆయన మార్చడు. ఎందుకంటే మనం కోరుకున్నదే ఆయన మనకిచ్చాడు – ఆయన లేడన్నట్లుగా, ఆయన మనకవసరం లేదన్నట్లుగా మనం ప్రవర్తించే ఈ లోకం - మనం కోరుకొన్నదే.

ఆదాము అవ్వల కథ గుర్తుందా? తినవద్దన్న పండును వారు తిన్నారు. దేవుణ్ణి, ఆయన మాటలను నిర్లక్ష్యం చేయవచ్చన్న ఆలోచనే ఆ పండు. అది దేవుడు లేని జీవితానికి నడిపిస్తుంది.

ఆదాము అవ్వలు, దేవునితో పని లేకుండా, తామే దేవునిలా అవ్వగలమని ఆశించారు. వారు - దేవునికన్నా విలువైనది ఇంకా ఏదో ఉందనీ, ఆ దేవునితో వ్యక్తిగత సంబంధం కన్నా మరింత విలువైనదేదో ఉన్నదనే ఆలోచనలో మునిగిపోయారు. ఆనాడు వారు ఎన్నుకున్న దాని ఫలితమే - అన్ని లోపాలతో కూడిన ఈనాటి ఈ లోక వ్యవస్థ.

ఇదే మనందరి కథ కాదా? బయటికి చెప్పక పోయినా, కనీసం తమ హృదయంలోనైనా -“ ఓ దేవుడా, నీతో నాకు అవసరం లేదు. నాకు నేనే దీన్ని చేయగలను. నీతో నాకు పని లేదు “ అని చెప్పని వారెవరు?

దేవునితో పని లేకుండానే జీవించాలని మనందరం ప్రయత్నిస్తున్నాం. ఎందుకిలా చేస్తున్నాం? బహుశా- దేవునికన్నా మరింత ముఖ్యమైన, మరింత విలువైనదేదో ఉందనే అభిప్రాయాన్ని పెంపొందించుకోవడం వల్ల కావచ్చు. ఒక్కొక్కరి ఆలోచన ఒక్కోలా ఉండొచ్చు కానీ వాళ్ళందరిలో ఉండే మనస్తత్వం ఒక్కటే – “జీవితంలో దేవుడు అంత ముఖ్యం కాదు. మరీ చెప్పాలంటే, ఆయనతో పని లేకుండానే నేను బ్రతగ్గలను.”

మరి దీనికి దేవుని ప్రతిస్పందన ఏమిటి?

ఆయన దాన్ని అనుమతిస్తాడు. చాలామంది, దేవుని మార్గానికి భిన్నంగా తాము లేక ఇతరులు చేసే నిర్ణయాలకు ఫలితంగా కలిగే బాధాకరమైన ఫలితాలను అనుభవిస్తారు...హత్య, లైంగిక వేధింపులు, అత్యాశ, అబద్దం, వంచన, దూషణ, వ్యభిచారం, కిడ్నాప్, మొదలైనవి. దేవునికి, ఆయన ప్రభావానికీ తమ జీవితాల్లో చోటివ్వని వారి క్రియల ఫలితమే ఇవన్నీ. వారు తమకిష్టం వచ్చినట్లుగా బ్రతుకుతుండడం వల్ల తమకూ, ఇతరులకు కూడా బాధ కలిగిస్తారు.

దీన్నంతటినీ దేవుడు ఎలా చూస్తున్నాడు? మనకు జీవం కలుగునట్లుగా మనమాయన దగ్గరకు తిరిగి రావాలని ఆశిస్తూ, కనికరంతో తానే ముందుకొచ్చినవాడై, నిజమైన జీవం మనకివ్వడానికి సిద్ధంగా ఉన్న వాడాయన. “ప్రయాస పడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతి కలుగజేతును”(మత్తయి 11:28) అని యేసు పిలుస్తున్నాడు. ఐతే ఆయన దగ్గరకు రావడానికి అందరూ ఇష్టపడడం లేదు. దీనిని గూర్చి యేసయ్య మాట్లాడుతూ, - “ యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్ళతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రింద కేలాగు చేర్చుకోనునో, ఆలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చు కొనవలెనని యుంటిని గాని మీరు ఒల్లక పోతిరి” (మత్తయి 23:37) అని అన్నాడు. మళ్ళీ , యేసయ్య, తనతో మనకుండవలసిన సంబంధాన్ని గురించి మాట్లాడుతూ “ నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు గలిగి యుండును” (యోహాను 8:12)అని చెప్పాడు.

అయితే, జీవితం అన్యాయంగా ఉందనిపించినపుడు పరిస్థితి ఏమిటి? ఇంకొకరి మూలంగా మనకు ఎదురయ్యే భయంకర పరిస్థితుల మాటేమిటి? మనం బాధించబడినామని అనిపించినపుడు- దేవుడు కూడా ఇతరులవల్ల భయంకర అనుభవాన్ని చవి చూసాడని గ్రహిస్తే, అది మనకెంతో ఉపయోగకరంగా ఉంటుంది. మనం గ్రహించ గలిగిన దానికన్నా ఎక్కువగా దేవుడు మన పరిస్థితిని అర్ధం చేసుకుంటాడు.

మనకోసం యేసు క్రీస్తు సహించిన దానికన్నా బాధాకరమైనదేదీ జీవితంలో లేదు. ఆయన స్నేహితులు ఆయన్ను విడిచిపెట్టారు, ఆయన్ను నమ్మనివారు ఆయన్ను హేళన చేశారు, సిలువ వేయడానికి ముందు కొట్టి హింసించారు, మేకులతో సిలువకు అంటగొట్టి బహిరంగంగా వ్రేలాడదీశారు, ఊపిరందక సతమతమౌతూ అవమానకరమైన మరణాన్ని ఆయన పొందాడు. ఆయనే మన సృష్టికర్త ఐనప్పటికీ, ఇదంతా చేయడానికి ఆయన మనుషులను అనుమతించాడు. తద్వారా లేఖనాలను నెరవేర్చి మనలను మన పాపం నుండి విడిపించాడు. ఇది యేసుక్రీస్తుకు ఆశ్చర్యం కలిగించేదేమీ కాదు. జరగబోయేదేమిటో ఆయనకు ముందే తెలుసు. తనకు కలుగ బోయే బాధ, హింస, అవమానం అన్నీ ఆయనకు ముందే తేటగా తెలుసు. “యేసు యెరూషలేమునకు వెళ్ళనైయున్నప్పుడు ఆయన పండ్రెండుమంది శిష్యులను ఏకాంతముగా తీసికొనిపోయి, మార్గమందు వారితో ఇట్లనెను. ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము; అక్కడ మనుష్యకుమారుడు ప్రధానులకును శాస్త్రులకును అప్పగింపబడును; వారయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకును ఆయనను అప్పగింతురు; మూడవ దినమున ఆయన మరల లేచును.” (మత్తయి 20:17 -19)

భయంకరమైనదేదో నీకు జరుగబోతోందని ముందుగానే తెలిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో! భౌతిక, మానసిక వేదన ఎలా ఉంటుందో యేసు అర్ధం చేసుకోగలడు. ఆ రాత్రి తనను పట్టుకొని బంధిస్తారని తెలిసి కూడా, తన స్నేహితులను వెంటబెట్టుకొని ప్రార్ధించడానికి వెళ్లాడాయన. “ పేతురును, జెబెదయి యిద్దరు కుమారులను వెంటబెట్టుకొనిపోయి, దుఃఖపడుటకును, చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు-మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగియున్నది; మీరు ఇక్కడ నిలిచి, నాతోకూడా మెలకువగా నుండుడని వారితో చెప్పి,కొంత దూరము వెళ్లి సాగిలపడి – నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్దనుండి తొలగిపోనిమ్ము, అయినను నా యిష్టప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్మని ప్రార్ధించెను.” (మత్తయి 26:37-39). ఆయన ముగ్గురు శిష్యులు ఆయనతో ఉన్నా, ఆయన పడుతున్న వేదన తీవ్రత వారెరుగరు. కొంతసేపటి తర్వాత ఆయన తిరిగి వచ్చి చూస్తే, వాళ్ళంతా నిద్ర పోతున్నారు. భయంకరమైన వేదన, విచారాన్ని ఒంటరిగా ఎదుర్కోవడం ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు.

దీనినే యోహాను తన సువార్తలో సంక్షిప్తంగా ఇలా వివరించాడు: “ఆయన లోకములో ఉండెను, లోకమాయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలిసికొనలేదు. ఆయన తన స్వకీయులయొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.” (యోహాను 1:10-12)“లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంపలేదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.” (యోహాను 3:17,16)

బాధ, తీవ్రమైన శ్రమ ఈ లోకంలో ఉన్నాయనడంలో సందేహమేమీ లేదు. అందులో కొన్ని ఇతరుల స్వార్ధపూరితమైన, ద్వేషంతో కూడిన చర్యల ఫలితమని చెప్పవచ్చు. మరికొన్నిటికైతే ఈ జీవితంలోనే జవాబు దొరకదు. అయితే దేవుడు తనను తానే మనకిస్తున్నాడు. తాను కూడా శరీర ధారిగా ఉన్నప్పుడు శ్రమను, బాధను, సహించి యున్నాడు గనుక మన శ్రమ, బాధ, మన అవసరాలను గూర్చిన అవగాహన కలిగి యున్నాడు. యేసు తన శిష్యులతో మాట్లాడుతూ,-‘శాంతి మీకనుగ్రహించి వెళ్ళుచున్నాను; నా శాంతినే మీకనుగ్రహించుచున్నాను; లోకమిచ్చునట్టుగా నేను మీ కనుగ్రహించుట లేదు; మీ హృదయములను కలవరపడనియ్యకుడి, వెరువనియ్యకుడి’ (యోహాను 14 :27) అని చెప్పాడు. భయపడడానికి, కలత పడడానికి బోలెడన్ని కారణాలు మనకున్నాయి. అయితే వాటన్నిటిని మించిన గొప్ప శాంతిని ఆయన మనకివ్వగలడు. ఎందుకంటే ఆయన సృష్టికర్తయైన దేవుడు. ఆయన అన్ని కాలములో సజీవుడై యుండి, ఈ విశ్వమంతటిని అలవోకగా తన శక్తి చేత కలుగ చేసిన వాడు.

ఆయన శక్తిమంతుడే కాక, మనలను సన్నిహితంగా ఎరిగిన వాడు. ప్రతీ అత్యల్పమైన సంగతినీ తేటగా ఎరిగిన వాడాయన. మన బ్రతుకంతటితో ఆయన యందు నమ్మికయుంచి, ఆయనమీద ఆధారపడితే, మనమెన్ని ఇబ్బందులనెదుర్కొన్నా ఆయన మనలను భద్రంగా ఉంచుతాడు. “నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నాను’”(యోహాను 16 : 33) అని యేసయ్య చెప్పాడు. మనల్ని ఎంతో భయపెట్టే మరణాన్ని ఆయన అనుభవించి దాన్ని జయించాడు. ఆయనయందు మనం విశ్వాసముంచినట్లయితే, జీవితంలో ఎదురయ్యే ఎలాంటి కష్టమైన పరిస్థితిలోనైనా ఆయనే మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు, నిత్యజీవానికి మనలను చేరుస్తాడు.

ఈ జీవిత ప్రయాణంలో దేవునితోనైనా, లేక దేవుడు లేకుండానూ నడువవచ్చు. యేసయ్య - “నీతి స్వరూపుడవగు తండ్రీ, లోకము నిన్ను ఎరుగలేదు; నేను నిన్ను ఎరుగుదును; నీవు నన్ను పంపితివని వీరెరిగియున్నారు.నీవు నాయందు ఉంచిన ప్రేమ వారియందు ఉండునట్లును, నేను వారియందు ఉండునట్లును,వారికి నీ నామమును తెలియజేసితిని, ఇంకను తెలియజేసెదను” (యోహాను 17 : 25,26)అని ప్రార్ధించారు.

“జీవితం ఎందుకింత కష్టంగా ఉంది?” అని నీకు నీవే ప్రశ్నించుకుంటూ ఉండవచ్చు. జీవితంలో దేవుడు లేకపోతే, మానవాళి చాలా సుళువుగా ద్వేషం, జాతి వైషమ్యం, లైంగిక విశృంఖలత్వం, ఒకరినొకరు చంపుకోవడం మొ!!న వాటిలోనికి జారిపోతుంది. అందుకే–“మీకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చియున్నాను” (యోహాను 10:10) అని యేసయ్య చెప్పాడు. ఆ దేవునితో అనుబంధాన్ని ఏర్పరచుకోవడం ఎలాగో తెలుసుకోవాలంటే, దేవుని వ్యక్తిగతంగా తెలుసుకొనుట అనే ఆర్టికల్ చూడండి.

 దేవునితో సంబంధం ఎలా ప్రారంబించాలి ?
 నాకు ఒక ప్రశ్నఉన్నది,,,
ఇతరులతో పంచుకోండ  

TOP